కలం, చండూరు : నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తూ అమాయక ప్రజలను, వ్యాపారులను మోసం చేస్తున్న ఒక ముఠాను చండూరు (Chandur) పోలీసులు శ్రమించి పట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల సాకుతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి నకిలీ నోట్ల ముద్రణ నేర్చుకుని, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలలో చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, ప్రింటర్, స్కానర్, బైక్‌తో పాటు నోట్ల తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన ఆవుల కిరణ్ అనే వ్యక్తి జూన్ 12న చండూరు టౌన్‌లోని శ్రీ మాధురి మిల్క్ సెంటర్ వద్ద పాలు అమ్ముతుండగా, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బెజవాడ రాజీవ్ అలియాస్ రాజు అనే వ్యక్తి పాల ప్యాకెట్ కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. ఆ నోటును నిశితంగా గమనించిన కిరణ్ అది నకిలీ నోటుగా గుర్తించి వెంటనే చండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రత్యేక బృందాల నిఘా.. కంచర్ల టవర్స్ వద్ద అరెస్ట్
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూరు సీఐ టి.రాము ఆధ్వర్యంలో ఎస్‌ఐ శివకుమార్, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిఘా పెట్టిన పోలీసులు.. జూన్ 15న ఉదయం 10 గంటలకు నల్గొండ-మిర్యాలగూడ రోడ్డులోని కంచర్ల టవర్స్‌లో నివాసం ఉంటున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము ఆన్‌లైన్‌లో ప్రింటర్, పేపర్లు కొనుగోలు చేసి, యూట్యూబ్ ద్వారా నకిలీ నోట్ల తయారీ నేర్చుకుని చలామణి చేస్తున్నట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడు బెజవాడ రాజీవ్ @ రాజు (38)పై గతంలో ఒక హత్య, ఒక హత్యాయత్నం కేసులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 7 నకిలీ నోట్ల చలామణి కేసులు ఉన్నాయి. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉంది. ఏ2 దుర్గం పావని (26) సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన గృహిణి. నిందితుల స్థావరం నుంచి 15 నకిలీ రూ.500 నోట్లు, నంబర్ లేని పల్సర్ బైక్, హెచ్‌పీ ప్రింటర్, స్కానర్, 100 బాండ్ పేపర్లు, కట్ చేసిన పేపర్లు, కత్తెర, స్పార్కెల్ పెన్, స్టీల్ స్కేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన చండూరు ఎస్‌ఐ శివకుమార్, ఏఎస్‌ఐ శ్రీరాములు, కానిస్టేబుళ్లు ఆనంద్ రెడ్డి, శివరాం కృష్ణ, నరేందర్, ఉపేందర్‌లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. వ్యాపారులు, సామాన్య ప్రజలు నగదు లావాదేవీలు జరిపే సమయంలో రూ.500 నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

