కలం, స్పోర్ట్స్ : ఒక బంతి.. ఒక్క వికెట్.. కానీ ఆ క్షణం మాత్రం జై మూంద్రా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్ ఆడిన ఐర్లాండ్ యువ పేసర్ జై ముంద్రా (Jai Moondra) వేసిన మొదటి బంతికే భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో అతని అరంగేట్రం కలల ఆరంభంగా మారింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి ఓవర్‌లోనే వేగంగా పరుగులు సాధించి భారత్‌కు దూకుడు ఇచ్చాడు.
అయితే రెండో ఓవర్ ఆరంభంలోనే ఐర్లాండ్ కెప్టెన్ కొత్త బౌలర్ జై మూంద్రాకు బంతి అందించాడు. అదే మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది. 23 ఏళ్ల ఎడమచేతి పేసర్ వేసిన తొలి బంతి ఆఫ్ స్టంప్ వెలుపల లెంగ్త్‌లో పడింది. బంతిని ఆఫ్‌సైడ్ వైపు మళ్లించాలని సంజూ శాంసన్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ లోపలి అంచును తాకి నేరుగా స్టంప్స్‌ను గిరాటేసింది. ఒక్కసారిగా స్టేడియం ఉత్సాహంతో మార్మోగిపోయింది. సంజూ నిరాశగా పెవిలియన్ చేరగా, జై మూంద్రా ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు.
సహచర ఆటగాళ్లు అతడిని అభినందనలతో ముంచెత్తారు. ఈ వికెట్‌తో జై మూంద్రా అరుదైన ఘనత సాధించాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో ఐరిష్ బౌలర్గా చరిత్రలో నిలిచాడు. అంతకుముందు 2023లో మ్యాథ్యూ హంఫ్రీస్ బంగ్లాదేశ్ బ్యాటర్ రిషాద్ హొస్సేన్‌ను తన తొలి బంతికే ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే భారత స్టార్ బ్యాటర్ వికెట్ దక్కడం, అది కూడా తొలి బంతికే రావడం జై మూంద్రాకు చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఒక్క డెలివరీతోనే అతడు తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో తన రాకను ఘనంగా చాటాడు.

