కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేద ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నీరుగారుతోంది. కోట్ల రూపాయల నిధులతో అత్యాధునిక క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం ఒక సాధారణ వార్డులాగా మాత్రమే మిగిలిపోయింది. ఆరు నెలలు గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఇక్కడ సరైన వైద్యం అందడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ నిరుపయోగంగా మారింది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (Karimnagar Government Hospital)లో చావు బతుకుల మధ్య పోరాడే రోగుల కోసం 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 23 కోట్ల 75 లక్షల రూపాయల భారీ నిధులను వెచ్చించి ఈ అత్యాధునిక భవనాన్ని నిర్మించింది. గత ఏడాది జూలై 27న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విభాగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే, భవనం నిర్మించి, ప్రారంభోత్సవం జరిగి ఆరు నెలలు కావస్తున్నా… ఇక్కడ వైద్యుల నియామకం మాత్రం జరగలేదు. సాధారణ సేవలకు మాత్రమే ఈ యూనిట్ పరిమితమవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. అత్యవసర చికిత్స కోసం వస్తున్న రోగులను వరంగల్, హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తుండటంతో.. ప్రయాణంలోనే ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొంది.
అందుబాటులో వైద్య సేవలు.. రిఫరల్స్ మాత్రమే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితులను 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో ‘గోల్డెన్ అవర్’లోనే ఈ క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విలువైన సమయం వృథా అవుతోంది. తీవ్రమైన తల గాయాలు, గుండె సమస్యలు, కిడ్నీ వైఫల్యంతో వచ్చే రోగులకు ఇక్కడ పూర్తి స్థాయి చికిత్స అందడం లేదు. ఫలితంగా వైద్యులు చేతులెత్తేసి రోగులను వరంగల్ లేదా హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.
సుదీర్ఘ ప్రయాణంలోనే కొందరి పరిస్థితి విషమిస్తుండగా… మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ యూనిట్, వైద్యులు లేక వెలవెలబోతుండటంపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించి వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని, పూర్తి స్థాయిలో అత్యవసర సేవలను అందుబాటులోకి తెచ్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, కార్డియాలజిస్టులు వస్తే రిఫరల్స్ సంఖ్య పూర్తిగా తగ్గుతుందని, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వైద్యులతోనే సేవలు అందిస్తున్నామని సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు.
ట్రామా కేర్ పాలసీ ఏమయ్యింది?
11 వందలకు పైగా రోడ్డు ప్రమాదాలు. 400లకు పైగా మరణాలు. లెక్కకుమించి క్షతగాత్రులు. దేశంలో రహదారి ప్రమాదాలకు సంబంధించి ఒక రోజు గణాంకాలు ఇవి. వీటిలో ఎంతో మంది తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోల్పోతుంటారు. ఎక్కడో ఆవగింజంత అదృష్టం ఉండి బతికి బయటపడినవారు వైక్యాలనికి గురికాకుండా, ఎక్కువ రోజులు ఆసుపత్రుల్లో ఉండని వారిని వేళ్లమీద లెక్కపెట్టోచ్చు. కానీ మరణమైనా, వైకల్యమైనా అసలు సమస్య సకాలంలో చికిత్స అందకపోవడమే. ప్రమాదానికి గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడం లేదు. ఫలితంగా కొన ఊపిరితో ఉన్నవారికి గోల్డెన్ అవర్ లోపల వైద్యం అందటం కష్టంగా ఉంది. అందులోనూ మెరుగైన చికిత్స అందించడానికి ఆసుపత్రుల్లో సరైన వైద్య పరికరాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ట్రామాకేర్ పాలసీ ప్రారంభిస్తామని చెప్పి 911 స్పాట్స్‌ను గుర్తించారు.
ఈ ఆధారంగా 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా నెట్‌వర్క్ రూపొందిస్తామన్నారు. ఒక్కో సెంటర్‌ను సుమారు రూ.5.3 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ భారీ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తారని పేర్కొన్నారు. హైవేలపై ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుని, బాధితుడి పరిస్థితిని బట్టి తదుపరి స్థాయి హాస్పిటల్‌కు తరలించే విధంగా ఈ మొత్తం వ్యవస్థ చైన్ మోడల్‌లో పనిచేయనుంది. దీంతో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లామని చెప్పినా ఫలితమేదీ? అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
గోల్డెన్ అవర్ లో ప్రాణాలకేదీ రక్ష
హైవేలలో ప్రమాదాలు జరిగినప్పుడు తొలి గంట గోల్డెన్ అవర్‌గా చెబుతారు. ఆ గంటలోగా అవసరమైన చికిత్స అందిస్తే 90 శాతం ప్రాణాలు కాపాడవచ్చు. ట్రామా కేర్ సెంటర్‌తో ఇది సాధ్యమవుతుంది. హైవేలు.. రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్ర, జాతీయ ప్రధాన రహదారుల్లో ప్రమాదాలు జరిగితే ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్రంగా గాయపడుతుంటారు. వీరికి స్థానిక పీహెచ్‌సీలలో ప్రాథమిక వైద్యం అందించి పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్కా.. గాయపడ్డ వారికి చేయాల్సిన అన్ని రకాల వైద్య పరీక్షలు ఒకేచోట అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా స్కానింగులు, శస్త్రపరీక్షలకు తిరిగే సరికి కాలం గడిచిపోతోంది. క్షతగాత్రులు మృతులుగా మారుతున్నారు. అదే క్షతగాత్రులకు తక్షణం అన్నిరకాల స్కానింగులు చేసి, అవసరమైన శస్త్ర చికిత్స అందిస్తే వారి ప్రాణాల్ని కాపాడొచ్చు.
ఒక ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడితే ఏయే పరీక్షలు చేయాలో.. ఎలాంటి వైద్యం అందించాలో.. సరిగ్గా అవన్నీ ట్రామా కేర్ సెంటర్లలో ఉంటాయి. అల్ట్రా సౌండ్ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, సిటీ స్కాన్, బ్లడ్ బ్యాంకు వంటి సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. వైద్య సేవలు అందించేందుకు ఆర్థో, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్, ఎనస్తీషియన్, రేడియాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ వంటి వైద్య నిపుణులూ ఉంటారు. క్షతగాత్రులను అవసరమైన ఎంత పెద్ద చికిత్సనైనా అందించేందుకు పరికరాలు, నిపుణులు అందుబాటులో ఉండటంతో వెంటనే వైద్యం అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడతారు. ఈ సెంటర్ 24 గంటలూ పనిచేయాల్సి ఉన్నా కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి దిక్కు లేదు.

