కలం, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన జగిత్యాల (Jagtial) జిల్లా యువకుడు ఎడారిలో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ‘నన్ను కాపాడండి’ అంటూ బాధితుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో (Selfie Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బిబి రాజ్‌పల్లికి చెందిన దాసరి అరవింద్ (23) మంచి ఉద్యోగం ఆశతో సౌదీ అరేబియాకు వెళ్లాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఓ ఏజెంట్ అతని నుంచి రూ.90 వేల వరకు వసూలు చేశాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అరవింద్‌కు చెప్పిన ఉద్యోగం ఇవ్వకుండా, రియాద్‌కు దాదాపు 950 కిలోమీటర్ల దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నారు.
తాజాగా అరవింద్ (Dasari Aravind) విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో తన దయనీయ పరిస్థితిని వివరించాడు. తినడానికి సరైన ఆహారం లేదని, తాగునీరు కూడా కష్టంగా మారిందని, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వాపోయాడు. అంతేకాకుండా యజమాని వేధింపులకు గురి చేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. తనను ఈ కష్టాల నుంచి రక్షించి స్వదేశానికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ, అలాగే స్వచ్ఛంద సంస్థలను అరవింద్ వేడుకుంటున్నాడు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: మరో సంచలన వివాదంలో బండి సంజయ్ కొడుకు
Follow Us On: WhatsApp

