కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో ఈనెల 20వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ (Jagtial SP) అశోక్ కుమార్ (Ashok Kumar) ప్రజలకు సూచించారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ నిర్వహణకు సంబంధించిన కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు తదితర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుందని ఎస్పీ తెలిపారు.
“రాజీ మార్గమే రాజమార్గం” అనే భావనతో న్యాయ వ్యవస్థ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు. తమ కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.

