కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కేంద్రం చల్గల్‌లో కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌కు 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) శనివారం వెల్లడించారు. నేషనల్ హైవేకు సమీపంలోని వాలంతరి సంస్థకు చెందిన 12 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించారు. స్థల కేటాయింపునకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రెండో దశలో మంజూరైన 8 యంగ్ ఇండియా స్కూళ్లలో జగిత్యాలకు ఒకటి దక్కిందన్నారు. కేంద్రీయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు త్వరలో కలెక్టర్ ద్వారా స్థల పొజిషన్ ఇప్పిస్తామని, ఆట స్థలానికి అదనపు స్థలం కేటాయింపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యాసంస్థలను రాజకీయం చేయొద్దని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు.

