జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రజలకు వైద్యుల కీలక సూచనలు!

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు మహాలక్ష్మి నగర్‌లో విష జ్వరాల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వరుసగా జ్వర కేసులు (Fever Cases) నమోదవుతున్న నేపథ్యంలో సోమవారం ప్రత్యేక వైద్య బృందంతో ఇంటింటి సర్వే నిర్వహించారు.

జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. అర్చన, మోతె వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, డాక్టర్. స్రవంతి ఆధ్వర్యంలో మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్లు సత్యనారాయణ, ఆవారి శ్రీధర్, నర్సింగ్ ఆఫీసర్ సుజన్ కుమార్, ఏఎన్ఎం శిరీష, ఆశా కార్యకర్తలు మంజుల, లావణ్యలు ఇంటింటికి తిరిగారు. ప్రతి ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి వారికి మందులు అందజేశారు. ఇంటి పరిసరాలు, డాబాలపై, కూలర్లు, పాత టైర్లు, పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. దోమల లార్వా ఉన్న నీటి నిల్వలను గుర్తించి తొలగించారు.

ఈ సందర్భంగా డా. అర్చన మాట్లాడుతూ.. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలయ్యే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తాయన్నారు. ఇంట్లో నిల్వ ఉన్న మంచినీటిలోనే డెంగ్యూ దోమలు గుడ్లు పెడతాయని, ఒక్క దోమ వందలాది మందికి వ్యాధిని వ్యాపింపజేస్తుందని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి ఫ్రిజ్ వెనుక, కూలర్లు, నీటి ట్యాంకులు, కుండీల్లో నీటిని శుభ్రం చేయాలన్నారు. పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు కుట్టకుండా పూర్తి చేతులు కలిగిన దుస్తులు ధరించాలని, నిద్రించే సమయంలో దోమతెరలు వాడాలని సూచించారు.

జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని, సొంత మందులు వాడకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్ష చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు ఉచితంగా పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రజలందరూ సహకరిస్తేనే విష జ్వరాలను పూర్తిగా నియంత్రించగలమని అర్చన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానికులు పాల్గొన్నారు.

Also Read : గుజరాత్‌లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>