కలం, వెబ్ డెస్క్ : జాగృతి పోరాటాలతోనే దేశంలో మహిళా బిల్లు కార్యరూపం దాల్చుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. మహిళ బిల్లు కోసం ఢిల్లీలో తాను చేసిన దీక్షకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తరలివచ్చారని.. 18 పార్టీలను కో ఆర్డినేట్ చేసి వారు దీక్షలో పాల్గొనేలా చేశామని వెల్లడించారు. తద్వారా పార్లమెంట్ లో ఈ అంశంపై ఆయా పార్టీల ఎంపీలు మాట్లాడే విధంగా ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. మహిళ బిల్లు కోసం జాగృతి ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెట్టామని.. ఫలితంగా మహిళ బిల్లు వచ్చిందని వివరించారు. మహిళ బిల్లు కోసం జాగృతి మొదలుపెట్టిన పోరాటం ద్వారా యావత్ దేశ మహిళలకు మేలు జరిగే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
కేంద్రం నిర్ణయంతో మహిళలకు అన్యాయం
ఈ బిల్లు విషయంలో బీజేపీ ఎప్పటిలాగే తమ మోసపూరిత వైఖరి అవలంభించాలని ప్రయత్నిస్తుందని కవిత ఆరోపించారు. డిలిమిటేషన్ ను మహిళ బిల్లుకు (Women Reservation Bill) ముడిపెట్టి బీసీ ఆడబిడ్డలకు కోటా లేకుండానే ఈ బిల్లు పాస్ చేశారని మండిపడ్డారు. దీంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, అదే విధంగా ఆ తర్వాత జరిగిన 12 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు బిల్లు ప్రయోజనం రాలేదని చెప్పారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారని.. దీనివల్ల మళ్లీ మహిళలకు అన్యాయం జరుగుతుందని వివరించారు.
బీసీ మహిళలకు సబ్ కోటా డిమాండ్
మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏకపక్షమని కవిత (Kalvakuntla Kavitha) ఫైర్ అయ్యారు. 2027 జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈసారి జన గణనలో బీసీల లెక్క తీస్తామంటున్నారని.. ఆ లెక్క తేలిన తర్వాత బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని కోరారు. కొన్నిరోజుల్లో ఈ బిల్లు మీద చర్చ పెడుతామని కేంద్రం చెబుతున్నా… ఇప్పటివరకు ఈ డ్రాఫ్ట్ బిల్లును ఏ పార్టీకి ఇవ్వలేదన్నారు. కాబట్టి వెంటనే డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ బిల్లు అంశంతో పాటు 2011 జనాభా లెక్కలు ఆధారంగా మహిళ బిల్లు చేస్తామన్న బీజేపీ వైఖరిని ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అంశంపై గతంలో తనతో వచ్చిన 18 పార్టీల నాయకులతో తాను మాట్లాడతానన్నారు. జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో సబ్ కోటా కల్పించాలని.. మహిళా కోటాలో ఓబీసీ సబ్ కోటా కోసం జాగృతి ఉద్యమిస్తుందని చెప్పారు.
Read Also: ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు : జీవన్ రెడ్డి
Follow Us On: Instagram

