హనుమకొండ జిల్లాను వరంగల్‌లో కలపాలి : పౌర సంఘాల బాధ్యుల డిమాండ్

కలం, వరంగల్ బ్యూరో :  హనుమకొండ (Hanumakonda) జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి మహానగరంగా అభివృద్ధి చేయాలని పౌర సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ వరంగల్ మహానగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశించినప్పటికీ, ఆ ఆశలు నెరవేరలేదని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితమైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఎదగగల సామర్థ్యం ఉన్న వరంగల్‌ను విభజించడం వల్ల అభివృద్ధి దెబ్బతినిందని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని భూములు, పార్కులు ఆక్రమణకు గురవడం, మౌలిక వసతుల అభివృద్ధి నిలిచిపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కొండూరు సుధాకర్ మాట్లాడుతూ.. హనుమకొండ (Hanumakonda) జిల్లా అభివృద్ధి పరంగా వెనుకబడి 33వ స్థానంలో నిలిచిందని ప్రభుత్వ గణాంకాలతో వివరించారు. వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఒక దశలో రెండు జిల్లాలను కలిపి వరంగల్‌గా ప్రకటించాలనే ఆలోచన వచ్చినప్పటికీ, రాజకీయ కారణాలతో అది ఆగిపోయిందని పేర్కొన్నారు.

మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చుక్కయ్య మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధిని అడ్డుకునే విధంగా విభజన జరిగిందని ఆరోపించారు. ప్రముఖ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఐక్యంగా కృషి చేస్తేనే నగర ఏకీకరణ సాధ్యమవుతుందని అన్నారు. సిపిఐ నాయకుడు ఏదునూరి వెంకటరాజం మాట్లాడుతూ నగర విభజన ప్రజల కోరిక కాదని, కొందరి ప్రయోజనాల కోసమే జరిగిందని విమర్శించారు. వరంగల్ అభివృద్ధి కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని  సూచించారు. ఈ సదస్సులో పలువురు ప్రొఫెసర్లు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని వరంగల్ మహానగర అభివృద్ధికి ఏకీకరణ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

Read Also: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>