కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల పరిధిలో పెద్దపులి సంచారం (Jagityal Tiger) స్థానిక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత పరిసరాల్లో తిరుగుతున్న పులి, తాజాగా సూరంపేట, గంగారాం తండా సమీపంలోని అటవీ ప్రాంతాల్లో రెండు ఆవులపై దాడి చేసి చంపివేసింది. ఈ ఘటనతో అటవీ గ్రామాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాల్లో పులికి సంబంధించిన దృశ్యాలు రికార్డు కావడంతో, పులి సంచారం ఉన్నట్లు అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ముందుజాగ్రత్త చర్యగా, ఇతర జంతువులకు లేదా పరిసరాలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు పులి దాడిలో మరణించిన ఆవుల కళేబరాలను అధికారులు దహనం చేశారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజలకు, ముఖ్యంగా పశువుల కాపరులకు కీలక సూచనలు జారీ చేశారు. పులి సంచారం ఉన్నందున ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు సమూహాలుగా వెళ్లాలని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాకల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

