కలం, డెస్క్ : శ్రీశైలం ఆలయంలో శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణం అన్నారు మాజీ సీఎం జగన్ (Jagan). ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో భక్తులు ఆలయాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో నమ్మకంతో ఆలయాలకు వెళ్లిన భక్తులు.. ఇప్పుడు ఆందోళన, భయాలతో వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్ (Jagan). సీఎం చంద్రబాబు పాలనలో ఆలయాల్లో వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని.. కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా సరే.. కావాలని ఇలా చేయడం ప్రభుత్వ విధానానికి అద్దం పడుతోందని తెలిపారు మాజీ సీఎం జగన్.
ప్రభుత్వం ఎక్కడా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదని.. భక్తులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందిస్తున్న దారుణంగా ఉందని జగన్ విమర్శించారు. ‘దాడులు, ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం రొటీన్ సమీక్షలకే పరిమితం అవుతోంది తప్ప.. ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. జవాబుదారీతనంతో వ్యవహరించట్లేదు. శ్రీశైలం ఆలయంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే కనిపిస్తోంది. మహాశివరాత్రి సమయంలో శివమాల భక్తులకు ఏళ్లుగా ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు తెలుసు. అయినా సరే ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గంటల తరబడి కుటుంబాలతో దారుణమైన పరిస్థితుల్లో వేచి చూసే పరిస్థితి తీసుకొచ్చారు. చివరకు లాఠీచార్జ్ చేసి తరిమికొట్టారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే’ అంటూ మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.


