కలం, వెబ్‌డెస్క్: ముస్లిం వ్యక్తికి మద్దతుగా నిలవడమే కాక, తన పేరును మహ్మద్ దీపక్ (Mohammed Deepak) అని చెప్పిన వ్యక్తికి షాక్. అతని జిమ్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఎంతలా అంటే 150 నుంచి 15కు కస్టమర్లు తగ్గారు. విషయమేంటంటే.. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో దీపక్ కుమార్ అనే బాడీ బిల్డర్, కోచ్‌కు బద్రినాథ్ రోడ్డులో ‘హల్క్ జిమ్’ ఉంది. అతని షాపు ఎదురుగా వకీల్ అహ్మద్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ‘బాబా స్కూల్ డ్రస్’ పేరుతో ఒక దుస్తుల దుకాణం నడుపుతున్నారు.
ఈ షాపులోని ‘బాబా’ అనే పేరు తొలగించాలంటూ గత నెల 26న ఓ వర్గానికి చెందిన సంస్థ సభ్యులు షాపుపై దాడికి దిగారు. అది చూసి వాళ్లను దీపక్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. అనంతరం వాళ్లు పేరు అడగ్గా, మహ్మద్ దీపక్ అని చెప్పారు. అనంతరం వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, గొడవకు సంబంధించిన విషయం, ముస్లిం వ్యక్తికి మద్దతుగా నిలిచే క్రమంలో తన పేరు మహ్మద్ దీపక్‌గా చెప్పడంతో మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీపక్‌ను, అతని ధైర్యాన్ని అభినందిస్తూ ఎంతో మంది మెసేజ్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.
అయితే, రెండు వారాల్లోనే దీపక్ (Mohammed Deepak) పరిస్థితి తలకిందులైంది. అతని జిమ్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య 90శాతానికి తగ్గిపోయింది. దీంతో దీపక్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. జిమ్ రెంట్ రూ.40వేలతోపాటు నెలనెలా చెల్లించాల్సిన హోమ్‌లోన్ రూ.16వేలు ఎలా కట్టాలో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం దీపక్ కుటుంబం అతని 70 ఏళ్ల తల్లి నడుపుతున్న టీ స్టాల్ ఆదాయంపై ఆధారపడింది.


