కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న స్మార్ట్ మీటర్ల విధానం పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం మోపేదిగా ఉందని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో భారీ స్థాయిలో స్కామ్ జరుగుతోందని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
స్మార్ట్ మీటర్ల విధానంలో వినియోగదారులు ముందుగానే విద్యుత్ కోసం రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌ల మాదిరిగా కరెంట్ కూడా ప్రీపెయిడ్ విధానంలోకి వెళ్లడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అన్నారు. ఒకవేళ రీచార్జ్ చేసుకోలేని పరిస్థితి వస్తే పేద కుటుంబాలు చీకట్లోనే జీవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త భారం మోపడం అన్యాయమని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పేద కుటుంబాల్లో నెలవారీ ఆదాయం స్థిరంగా ఉండదని, అలాంటి వారు ముందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్ వినియోగించాల్సి రావడం తీవ్రమైన సమస్యగా మారుతుందని చెప్పారు.
స్మార్ట్ మీటర్ల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, కేవలం ప్రైవేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువస్తోందని ఆరోపించారు. విద్యుత్ వినియోగదారుల నెత్తిన అదనపు భారం మోపే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రజలపై భారం పెంచే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) డిమాండ్ చేశారు.
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

