కలం, వెబ్డెస్క్: పీఎస్ఎల్వీ సీ–62 (PSLV C62) విఫల ప్రయోగంలో ట్విస్ట్. సాంకేతిక కారణాల వల్ల అత్యంత కీలకమైన ‘అన్వేష’తోపాటు మరో 15 శాటిలైట్లు కక్ష్యలోకి చేరలేకపోయినా ఒక చిన్న క్యాప్సూల్ అడ్డంకులను అధిగమించింది. స్పెయిన్కు చెందిన కెస్ట్రల్ ఇనిషియల్ డెమానిస్ట్రేటర్(కేఐడీ–కిడ్) అనే ఈ క్యాప్యూల్స్ సురక్షితంగా కక్ష్యలోకి చేరి, తన పని ప్రారంభించింది. ఈ మేరకు ‘కిడ్’ను తయారుచేసిన ప్యారాడిమ్ సంస్థ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ‘పీఎస్ఎల్వీ సీ–62 నుంచి మా కిడ్ క్యాప్సూల్ నాలుగో దశ నుంచి వేరుపడింది. స్విచ్ ఆన్ అయి, మూడు నిమిషాలకు పైగా డేటాను భూమికి పంపింది. ఈ క్రమంలో అత్యధిక ఒత్తిడిని, తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకుంది. పూర్తి నివేదిక త్వరలో వెల్లడిస్తాం’ అని ట్వీట్లో పేర్కొంది.
25కేజీల బరువుతో, ఫుట్బాల్ సైజులో ఉన్న ఈ కిడ్ క్యాప్సూల్ జనవరి 12న ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ–62 (PSLV C62) ద్వారా నింగిలోకి ఎగిరింది. ఈ పీఎస్ఎల్వీ.. కిడ్తోపాటు భారత్కు చెందిన అత్యంత కీలక నిఘా శాటిలైట్ ‘అన్వేష’, మరికొన్ని దేశాలకు చెందిన 16శాటిలైట్లను కక్ష్యలోనికి చేర్చడానికి ప్రయత్నించింది. అయితే, మూడో దశలో టెక్నికల్ ఇష్యూ కారణంగా ప్రయోగం విఫలమైంది. శాటిలైట్లూ కక్ష్యలోకి చేరలేకపోయాయి. కానీ, కిడ్ మాత్రం తన గమ్యాన్ని చేరుకుంది. దీనిపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కిడ్ ఎందుకోసమంటే..
భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడేలా కెస్ట్రల్ ఇనిషియల్ డెమాన్స్ట్రేటర్(కిడ్) ను తయారుచేశారు. ఇది భూమి మీదకు తిరిగి ప్రవేశించే సమయంలో ఎదురయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వేగం, ఒత్తిడి వంటివి తట్టుకునేందుకు అవసరమైన టెక్నాలజీని రూపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రీ యూజబుల్ క్యాప్సూల్స్, స్పేస్ వెహికల్స్ తయారీకి మార్గదర్శకంగా పనిచేస్తుంది. కక్ష్యలోని శాటిలైట్ల రిపేరీలు, పార్ట్స్ రీప్లేస్మెంట్స్కి అవసరమయ్యే టెక్నాలజీ సిద్ధం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతరిక్షంలోని చెత్తను సేకరించి, భూమికి చేర్చడం లేదా అక్కడే నాశనం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమ ఏర్పాటు, మానవ సహిత మిషన్లకు అవసరమైన టెక్నాలజీ రూపొందించడంలో ఇది కీలకంగా ఉంటుంది.

Read Also: టెకీలకు టీసీఎస్ మరో షాక్
Follow Us On : WhatsApp


