కలం, స్పోర్ట్స్ : అక్టోబర్ 10 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ కొత్త సీజన్ (ISL 2026-27) మొదలుకానుంది. 2026-27 సీజన్ వచ్చే ఏడాది మే వరకు కొనసాగుతుంది. ఈసారి ఐఎస్ఎల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంప్రదాయ హోమ్-అండ్-అవే ఫార్మాట్ తిరిగి రానుంది. అదే సమయంలో లీగ్ కొత్త క్లబ్ ఆధారిత మోడల్లోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్లో మొత్తం 163 మ్యాచ్‌లు జరగనున్నాయి. 13 జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడతాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు షీల్డ్ అందిస్తారు. అదే జట్టును ఐఎస్ఎల్ అధికారిక ఛాంపియన్‌గా గుర్తిస్తారు.
అలాగే ఆసియా పోటీల్లో చోటు దక్కుతుంది. ప్లేఆఫ్స్ కూడా తిరిగి వస్తున్నాయి. టాప్-6లో నిలిచిన జట్లు ఐఎస్ఎల్ కప్ కోసం పోటీపడతాయి. దీంతో లీగ్ దశతో పాటు ప్లేఆఫ్స్‌లోనూ పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. కొత్త క్లబ్ ఆధారిత మోడల్లో జట్లకు మరిన్ని నిర్ణయాధికారాలు ఉంటాయి. భారత ఆటగాళ్లలో పెట్టుబడులు పెంచడం, పోటీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించడం, ఫుట్‌బాల్‌కు మరింత స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ మార్పుల లక్ష్యంగా ఉంది.
ఈ సీజన్లో బెంగళూరు ఎఫ్‌సీ, చెన్నైయిన్ ఎఫ్‌సీ, చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ, ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ, ఎఫ్‌సీ గోవా, ఇంటర్ కాశీ, కేరళ బ్లాస్టర్స్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ముంబై సిటీ ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్, ఒడిశా ఎఫ్‌సీ, పంజాబ్ ఎఫ్‌సీ, స్పోర్టింగ్ క్లబ్ ఢిల్లీ బరిలో ఉండనున్నాయి. అయితే చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ పాల్గొనడం నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుంది. ఇక 2025-26 ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ విజేతగా ప్రమోషన్ పొందిన డైమండ్ హార్బర్ ఎఫ్‌సీ ఈ సీజన్లో ఐఎస్ఎల్లో ఆడదు.
ప్రమోట్ అయిన జట్టుకు అవసరమైన పరిపాలనా రుసుము నిబంధనలను ఆ జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో వచ్చే సీజన్లో ఆ జట్టు ఐఎస్ఎల్ హోదాను కొనసాగించదు. 2027-28 సీజన్లో ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆడనుంది. ఈ మార్పులతో 2026-27 సీజన్ ఐఎస్ఎల్కు కొత్త దశగా మారనుంది. అక్టోబర్ 10న కొత్త సీజన్‌కు తెరలేవనుంది.

