పదేళ్లు ఏం చేయని వారు వాపై విమర్శలా?: మంత్రి సీతక్క

కలం, వనపర్తి: పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.. ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Seethakka)  మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్‌ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి చిట్యాల రోడ్డు వరకు సాగిన ర్యాలీలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ప్రతి నియోజవర్గానికి రూ.2 వేల కోట్లు..

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అంటేనే తప్పుడు ప్రచారమని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకంపై ఎవరో కేసు వేస్తే దానికి ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి బీఆర్‌ఎస్‌ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 72 వేల ఉద్యోగాలు కల్పించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తూ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.

రూ.300 కోట్లతో వనపర్తి అభివృద్ధి..

వనపర్తి నియోజకవర్గంలో తన శాఖల పరిధిలో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. హామ్‌ ప్రాజెక్టు కింద రూ.70 కోట్లతో పంచాయతీరాజ్‌ రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల రేషన్‌ కార్డులు, నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందించామని మంత్రి తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>