కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, తెలంగాణ ప్రణాళిక బోడ్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వ్యవహరం చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చర్యలు చేపట్టింది. అలాగే చిన్నారెడ్డి.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన విషయంలో విచారణ చేపట్టింది. ఈ ఇద్దరిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ అధిష్ఠానానికి (AICC) రిపోర్ట్ చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా వేటు వేసే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
కొండా సురేఖ చుట్టూ అనేక వివాదాలు
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా సంఘం మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయగా, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆమె వివరణనిచ్చారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహరం కూడా చర్చనీయాంశమైంది. దీంతో స్వయంగా మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వివరణ ఇచ్చారు. పార్టీ నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని హైకమాండ్ హెచ్చరించినట్లు సమాచారం.
చిన్నారెడ్డిపై ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆయన ఖర్గేకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం చిన్నారెడ్డిపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.

