కలం, వెబ్ డెస్క్: భారత్ ఆడుతున్న వన్డే మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని వెటరన్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కోరాడు. విరాట్, రోహిత్ కోసం ఈ పని చేయాలని బీసీసీఐకి సూచించాడు. వాళ్లను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడతారని, వాడితో ఆడటం ద్వారా యువ ప్లేయర్స్ కూడా చాలా నేర్చుకోగలుగుతారని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. అందుకే రోహిత్, కోహ్లీ ఎక్కువ వన్డేలు ఆడేలా షెడ్యూల్‌ను ప్రిపేర్ చేయాలని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని పఠాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనున్నారు. ఆ తర్వాత వన్డే మ్యాచ్‌లు లేకపోవడమే పఠాన్ ఆందోళనకు కారణమైంది. ఈ సందర్భంగానే భారత్.. మూడు వన్డేల సిరీస్‌లకు పరిమితం కాకుండా ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని ఆయన సూచించాడు. గత ఏడాది వన్డేల్లో కోహ్లీ 651 పరుగులు, రోహిత్ 650 పరుగులు నమోదు చేశారు. ఇలాంటి ఫామ్ కొనసాగుతున్న వేళ వీరికి మరిన్ని వన్డే అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్న పఠాన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
భారత జట్టు చివరిసారిగా ఐదు వన్డేల సిరీస్‌ను 2019లో ఆడింది. ఆ తర్వాత నుంచి మూడు వన్డేల సిరీస్‌లకే పరిమితమైంది. ముక్కోణపు సిరీస్‌లో భారత్ చివరిసారిగా 2015లో పాల్గొంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ చివరి దశలో ఉన్న సమయంలో వారికి గరిష్ట వన్డే మ్యాచ్‌లు కల్పించాల్సిన అవసరం ఉందని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.


