కలం, వెబ్ డెస్క్ : ఐఆర్సీటీసీ (IRCTC) ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. రైలు ప్రయాణికులకు మరింత సులువుగా, వేగంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ (IRCTC) సరికొత్త బీటా వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే క్యాప్చాలు, చికాకు పెట్టే పాప్అప్లు, వెబ్సైట్ నెమ్మదించడం వంటి సమస్యలకు ఈ కొత్త అప్డేట్తో చెక్ పడనుంది. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేలా రైల్వేశాఖ తన రిజర్వేషన్ ఇంజిన్‌ను పూర్తిగా ఆధునీకరిస్తోంది.
ఈ కొత్త వెర్షన్లో ఇకపై ప్రయాణికులు వేర్వేరు క్లాసుల సీట్ల లభ్యతను పదే పదే తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల సీట్ల వివరాలను చూసుకోవచ్చు. అంతేకాకుండా, బుకింగ్ ప్రక్రియను తక్కువ దశల్లో పూర్తి చేసేలా డిజైన్ చేశారు. ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండటంతో, తత్కాల్ లేదా సాధారణ బుకింగ్ సమయంలో సమయం వృథా కాకుండా వేగంగా టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ సరికొత్త రిజర్వేషన్ సిస్టమ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుందని రైల్వేశాఖ వెల్లడించింది.

