కలం, వెబ్ డెస్క్ : భవిష్యత్‌లో యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా జరిగే అవకాశం ఉన్నా.. జాతీయ సంకల్పం, శిక్షణ పొందిన సైనికులు, బలమైన సైనిక సామర్థ్యాలే గెలుస్తాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన (Rajnath Singh) మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీ, సంప్రదాయ సైనిక వ్యవస్థలు ఒకదానికొకటి పోటీ కాదని, అవి పరస్పరం కలిసి పనిచేస్తాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. టెక్నాలజీ యుద్ధాల తీరు మార్చినా, సంప్రదాయ సైనిక శక్తిని భర్తీ చేయలేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్–17ఏ కింద నిర్మించిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) నిర్మించిన ప్రాజెక్ట్–17ఏ యుద్ధనౌకల్లో ఇదే చివరిదని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఎండీఎల్ మరింత ఆధునిక యుద్ధనౌకలను నిర్మిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్–17ఏ కింద ఇప్పటికే ఐఎన్‌ఎస్ నీలగిరి (జనవరి 2025), ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి (ఆగస్టు 2025), ఐఎన్‌ఎస్ తారాగిరి (ఏప్రిల్ 2026), ఐఎన్‌ఎస్ దునగిరి (జూన్ 2026) నౌకాదళంలో చేరాయని రాజ్ నాథ్ గుర్తు చేశారు.
దాదాపు 6,670 టన్నుల పూర్తి లోడ్ స్థానభ్రంశం కలిగిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదన్నారు. గగనతల ముప్పులు, శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన బహుళ విధుల స్టెల్త్ ఫ్రిగేట్‌గా దీనిని రూపొందించారని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అలాగే రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలో కీలక కేంద్రంగా ఎదుగుతోందన్నారు.

