కలం, నిర్మల్ : జిల్లాలోని పేద మధ్యతరగతి ప్రజల ఉన్నతికి బ్యాంకులు ఊతమివ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ (MP Godam Nagesh) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డిసిసి), జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బ్యాంకింగ్ రంగం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని, గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకుల మొత్తం వ్యాపారంలో వృద్ధి నమోదైనట్లు వివరించారు.
వ్యవసాయ రంగానికి బ్యాంకులు అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు రుణాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు రూ.1,347.42 కోట్లు ఉండగా, ప్రస్తుత త్రైమాసికంలో రూ.2,447.42 కోట్లకు చేరినట్లు సమావేశంలో చెప్పారు. బ్యాంకర్ల కృషిని ఎంపీ అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకులు రుణ సహకారం అందించడం గొప్ప విషయం అని చెప్పారు. గత త్రైమాసికంలో రూ.497.93 కోట్లుగా ఉన్న ఎంఎస్ఎంఈ రుణాలు ప్రస్తుత త్రైమాసికంలో రూ.644.23 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.
గృహ రుణాల విభాగంలో కూడా గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు రూ.47.90 కోట్ల వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డులు, పశుసంవర్ధక, మత్స్య రంగ రుణాలు, మహిళా సంఘాల రుణాలు, విద్యా రుణాలు, పీఎంజెజెబివై, పిఎంఎస్బివై, ఎపివై వంటి సామాజిక భద్రతా పథకాలు మెరుగ్గా అర్హులకు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్బీఓ రాములు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామ్గోపాల్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ఎం నరేష్, నాబార్డ్ ప్రతినిధి అబ్దుల్లా రహూఫ్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు

