ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. బుధవారం మహబూబ్‌న‌గ‌ర్‌లోని శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయ‌న్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ పరిధిలోని 12 నుంచి 22వ డిస్ట్రిబ్యూటరీ గ్రావిటీ కెనాల్స్ కింద సాగవుతున్న సుమారు 10 వేల ఎకరాలకు చివరి తడులు అందడం లేదని దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో మరో 10 వేల ఎకరాలకు కూడా చివరి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం రెండు తడులకు సరిపడా నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన తుంగభద్ర జలాలను తక్షణమే విడుదల చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలోహన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్, క్రాంతి, మఖ్సూద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>