కలం, వెబ్‌డెస్క్: ఇరాన్ (Iran) తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన భగవంత్ కేసరి మూవీలోని ఒక మాస్ యాక్షన్ ఫైట్ సీన్‌ను ఇరాన్ తన అధికారిక హ్యాండిల్స్‌లో షేర్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఎంబసీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌కు కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగానే హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూ ఇరాన్ ఈ పోస్టు చేసింది.
ఈ వీడియోలో బాలకృష్ణకు ఎదురుగా వందలాది మంది శత్రువులు నిలబడి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. ఆయన ఏమాత్రం భయపడకుండా వారిని ఎదుర్కొంటాడు. ఈ ఫైట్ చివరలో ఒక భారీ గన్‌తో బాలకృష్ణ శత్రువులను టార్గెట్ చేస్తారు. ట్రంప్ ఎన్ని దాడులు చేసినా ఎదురొడ్డి పోరాడతామని, ఎన్ని బెదిరింపులు చేసినా భయపడే ప్రసక్తే లేదనే ఉద్దేశంతో ఇరాన్ ఈ వీడియో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ ట్రంప్‌ను బెదిరించేందుకు ఒక తెలుగు సినిమా క్లిప్లింగ్‌ను వాడుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోలో సంభాషణలు హిందీలో ఉండటంతో ఇరాన్ దీన్ని బాలీవుడ్ యాక్షన్ సీన్‌గా పేర్కొంది. ట్రంప్ ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తానంటూ హెచ్చరికలు చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇరాన్ ఎలాంటి దేశమో ఆయనకు తెలుసునని పేర్కొంది. కొంత కాలంగా ట్రంప్ హాలీవుడ్‌కు బదులు బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని సెటైర్లు వేసింది.

