కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం అనేక మలుపులు తిరుగుతోంది. అమెరికా చేస్తున్న దాడులను ఇరాన్ (Iran) దీటుగా తిప్పికొడుతోంది. ఒకవైపు శాంతి చర్చలకు డిమాండ్లు పెడుతూనే.. మరోవైపు దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ అమెజాన్ డేటా సెంటర్ (Amazon Data Center) దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో డేటా సెంటర్‌లోని సర్వర్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడంతో, గల్ఫ్ రీజియన్‌లోని క్లౌడ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.
అమెరికన్ వాణిజ్య, సాంకేతిక సంస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ సంస్థలు శత్రు దేశాల నిఘా, సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ దాడులకు పాల్పడింది. కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా, తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా మరిన్ని అమెరికన్ టెక్ దిగ్గజాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

