కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇరాన్ (Iran) అంతర్గత రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన భీకర దాడుల్లో అయతొల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోగా.. ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్ది రోజులకే ఆయన సుప్రీం లీడర్ గా నియామకమైనా.. ఇంతవరకు ఒక్కసారి కూడా బయటకు రాలేదు. సందేశాల వీడియో కూడా విడుదల కాలేదు. ఇరాన్ అధికారికంగా ఒక్క ప్రకటన చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఖమేనీ కాలు తొలగించిన వైద్యులు..
అమెరికా దాడుల్లో ఖమేనీ మొహం ఛిద్రమైందని, శరీరంలో అనేక చోట్ల బలమైన గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థల కంటపడకుండా.. ఆయన్ను అత్యంత రహస్యమైన ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. వైద్యులు, ఇరాన్ అధ్యక్షుడు, ఐఆర్జీసీ చీఫ్ మాత్రమే ఖమేనీని చూసేందుకు అనుమతి ఉంటుందని.. మిగతా వారెవరు ఆయన్ను కలిసే అవకాశం లేదని సమాచారం. శత్రువులకు చిక్కొద్దని ఖమేనీ కనీసం ఫోన్ లో ఎవరితో మాట్లాడటం లేదని, తన ఆదేశాలను పేపర్ పై రాసి అమలు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఒక కాలు పూర్తిగా తొలగించగా, త్వరలోనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయబోతున్నారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఐఆర్జీసీ పాలనలోకి..
సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం, ఆయన ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో దేశ పాలనా పగ్గాలను పూర్తిగా ఐఆర్జీసీ స్వాధీనం చేసుకుంది. ఇరాన్ (Iran) అధ్యక్షుడు, పార్లమెంట్ నామమాత్రంగా మారిపోయాయని.. వారు దేశంలో చమురు సరఫరాలు, ఆహార సంక్షోభం తలెత్తకుండా చూసుకోవడం వంటి అంశాలకే పరిమితమైనట్లు చెబుతున్నారు. విదేశాలతో సంబంధాలు, ఎలా దాడులు చేయాలనే కీలక అధికారాలను ఐఆర్జీసీ కైవసం చేసుకుంది. హర్మూజ్ జలసంధిపై ఐఆర్జీసీ పూర్తి పట్టు సాధించిందని టెహ్రాన్ మీడియా సైతం ధ్రువీకరిస్తోంది. మొత్తంగా ఆ దేశంలో అధికారాలు సుప్రీం లీడర్ నుంచి అత్యంత శక్తివంతమైన ఐఆర్జీసీకి వచ్చాయని.. రాబోయే రోజుల్లో ఆ దేశ రాజకీయాల్లో మరిన్ని మార్పులు ఖాయమని పశ్చిమాసియా పరిణామాల విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: ‘ RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
Follow Us On: X(Twitter)

