Mobile Popup Ad
Mobile Popup Ad

పాటిదార్ వీరవిహారం.. గుజరాత్ టార్గెట్ 255

కలం, స్పోర్ట్స్ : ధర్మశాలలో జరిగిన మ్యాచ్ (RCB vs GT) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. ఆర్‌సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ రజత్ పాటిదార్ అయితే గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. బౌండ్రీల వర్షం కురిపించాడు. తొలి బంతి నుంచే మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బ్యాటర్లు గుజరాత్‌ బౌలర్లపై దండయాత్ర ప్రారంభించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 254 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ హిస్టరీలోనే అత్యధిక స్కోరర్‌గా ఆర్‌సీబీ నిలిచింది. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వస్తే జేసన్ హోల్డర్ మంచి బౌలింగ్ వేశాడు. గుజరాత్ బౌలర్లలో ఎవరైనా ఆర్‌సీబీ బౌలర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు అంటే అది హోల్డర్ అనే చెప్పాలి. పరుగులను ఆపడమే కాకుండా రెండు వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సృష్టించిన విధ్వంసానికి పూర్తిగా చేతులెత్తేసింది. వన్ డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన పాటిదార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వేట కొనసాగిస్తూ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి జితేష్ శర్మ (15 నాటౌట్) చివర్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో మెరుపు ముగింపు ఇచ్చాడు. వీరిద్దరి ధాటికి ఆర్‌సీబీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి త్వరగానే అవుటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కోహ్లీ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేయగా, పడిక్కల్ 19 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరినీ జేసన్ హోల్డర్ వరుస ఓవర్లలో అవుట్ చేసి గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు దొరికిపోయాడు. టిమ్ డేవిడ్ (4) నిరాశపరిచినా పాటిదార్ ఆఖరి వరకు నిలబడి జట్టుకు కొండంత స్కోరు అందించాడు.

గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. కాగిసో రబడా 4 ఓవర్లలో 54 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణకు ఒక వికెట్ దక్కినప్పటికీ 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్ ఖాన్ (29 పరుగులు), మహ్మద్ సిరాజ్ (46 పరుగులు) వికెట్లు తీయలేకపోయారు. కుల్వంత్ ఖేజ్రోలియా కేవలం 2 ఓవర్లలోనే 31 పరుగులు ఇచ్చాడు. మొత్తానికి ఆర్‌సీబీ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఏ మేరకు ఛేదిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>