Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ ఆఫీసులు తగలబెట్టండి: బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ‘ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టండి. రైల్వే లైన్లు ధ్వంసం చేయండి. మిలిటెంట్ పోరాటాలు చేయండి. ఇలా చిన్నగా నిరసనలు తెలిపితే కుదరదు.‘ అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాల్క సుమన్ పార్టీ అంతర్గత సమావేశంలో  ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రైతుల కోసం ఆందోళన

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ఈ అంశాన్ని అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ఆందోళన చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బాల్క సుమన్ ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన సూచనల మేరకే బాల్క సుమన్ ఇలా కామెంట్ చేశారా? అన్న చర్చ కూడా సాగుతోంది.

రైతులు వస్తలేరు కదా..

తాము చేస్తున్న ఆందోళనలకు రైతులు రావడం లేదని కూడా బాల్క సుమన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘మనం చేసే ఆందోళనలకు ఒకరిద్దరు రైతులు కూడా రావడం లేదు. అంతా మనవాళ్లే ఉంటున్నారు. మనం ఇలా చిన్నగా పోరాటం చేస్తే కుదరదు. మిలిటెంట్ యాక్షన్‌లోకి దిగాలి. ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టాలి.’ అంటూ బాల్కసుమన్ కామెంట్ చేశారు.

ఉనికి కోసమేనా?

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. అందివచ్చిన ప్రతి అవకాశాలన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా రైతుల ధాన్యం కొనుగోలు అంశం బీఆర్ఎస్ పార్టీకి కలిసివచ్చింది. కానీ రైతులు ఆ పార్టీని నమ్ముతున్నట్టు కనిపించడం లేదు. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా రైతులు స్వచ్ఛందంగా  ఆందోళనలు చేస్తున్నారు. చివరినిమిషంలో బీఆర్ఎస్ వెళ్లి క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తోందని చర్చ సాగుతోంది. మరి బాల్క సుమన్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వ్యూహం అవలంభించబోతున్నదా? అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>