కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ వేదికపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31న జరగబోయే ఈ మెగా ఫైనల్‌కు బెంగళూరులోని (Bengaluru) చిన్నస్వామి స్టేడియం బదులు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను ప్రకటిస్తూ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. నిజానికి గత సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) హోమ్ గ్రౌండ్‌లోనే ఫైనల్ జరగాలి. కానీ, స్థానిక అసోసియేషన్, అధికారుల నుంచి వచ్చిన కొన్ని డిమాండ్లు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వేదికను మార్చక తప్పలేదని బోర్డు వివరించింది. కొన్ని సాంకేతిక, నిర్వహణ కారణాల వల్ల ఈసారి ప్లేఆఫ్స్‌ను మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్‌కే దక్కడం విశేషం. గతేడాది కోల్‌కతాలో వాతావరణం అనుకూలించదనే కారణంతో వేదికను మార్చగా, ఈసారి బెంగళూరులో నిబంధనల సమస్య ఎదురైంది. తాజా షెడ్యూల్ ప్రకారం, మే 26న ధర్మశాలలో మొదటి క్వాలిఫైయర్ జరుగుతుంది. ఆ తర్వాత మే 27న ముల్లన్‌పూర్‌లో ఎలిమినేటర్, మే 29న అదే వేదికపై రెండో క్వాలిఫైయర్ నిర్వహిస్తారు. చివరిగా మే 31న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. 70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లు ఈ తుది పోరులో తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్వాలిఫైయర్ 1: పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 26న ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఎలిమినేటర్: మే 27న మూడు, నాలుగో స్థానాల్లోని జట్లు న్యూ చండీగఢ్ (ముల్లన్‌పూర్) స్టేడియంలో తలపడతాయి.
క్వాలిఫైయర్ 2: క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేతతో మే 29న న్యూ చండీగఢ్‌లో పోటీ పడతాయి.

