కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్ (Mullanpur Stadium) వేదికగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడుతున్నాయి. గత సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరిన ఈ రెండు బలమైన జట్లు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అసలు పోరు మాత్రం మైదానంలోని కొందరు కీలక ప్లేయర్ల మధ్యే జరగనుంది. ఈ మ్యాచ్‌లో అభిమానుల కళ్లన్నీ ప్రధానంగా మూడు జంటలపైనే ఉన్నాయి.
మొదటగా, గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను అడ్డుకోవడానికి పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సిద్ధంగా ఉన్నాడు. గత సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని తన క్లాస్ చూపించిన సుదర్శన్‌ను ఔట్ చేసిన అనుభవం అర్ష్‌దీప్‌కు ఉంది. ఈ పోరు మ్యాచ్ టోన్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. రెండవ పోరు పంజాబ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, గుజరాత్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ మధ్య ఉండనుంది. స్టోయినిస్ దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచినా.. రషీద్ బౌలింగ్‌లో అతను గతంలో 15 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు ఔట్ కావడం ఈ పోరును మరింత రసవత్తరంగా చేస్తోంది.
ఇక మూడవ పోరు యుజ్వేంద్ర చాహల్ వర్సెస్ జోస్ బట్లర్ మధ్య సాగనుంది. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన చాహల్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో బట్లర్ గతంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈసారి అతడు ఎలా ఆడతాడో చూడాలి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో రికార్డును మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. అటు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కూడా విజయంతో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఇరు జట్లు 3-3తో సమానంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: తూతూమంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

