కలం డెస్క్ : గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో (IPL Auction) అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిన పృథ్వీ షా (Prithvi Shaw).. ఈ ఏడాది పలు ఫ్రాంఛైజీలకు ఫేవరెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా పృథ్వీని సొంతం చేసుకోవాలని ఇప్పటికే మూడు జట్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ప్రస్తుతం దేశవాళీ టీ20లో చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఆడుతూ మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 188 పరుగులు చేయడంతో పాటు 23 బంతుల్లో హాఫ్ సెంచరీతో తన దూకుడు బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఆ కసితోనే కొన్ని నెలల్లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ తన సత్తా చూపుతున్నాడు.
రంజీ ట్రోఫీలో 67.14 సగటుతో 470 పరుగులు చేశాడు. అందులో ఓ హైస్పీడ్ డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ప్రదర్శనలు షా తిరిగి తన పీక్ ఫామ్‌ను అందుకున్నాడని సూచిస్తున్నాయి. ఫలితంగా, ఐపీఎల్ 2026 మినీ వేలంలో పృథ్వీ షా కోసం కనీసం మూడు జట్లు పోటీలోకి దిగే అవకాశం ఉంది.
1. ముంబై ఇండియన్స్
మినీ వేలంలో పృథ్వీ షాను సొంతం చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ ఆసక్తి చూపవచ్చని అంచనా. జట్టులో ప్రస్తుతం కేవలం ₹2.75 కోట్లు పర్స్ మనీ మాత్రమే ఉండగా, ఐదుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. తక్కువ ధరకు లభించే బ్యాకప్ ఓపెనర్‌గా పృథ్వీ షాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కాంబినేషన్‌కు మంచి ప్రత్యామ్నాయంగా షా నిలవగలడన్న భావన ముంబైలో ఉంది.
2. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)
భారీ పర్స్‌తో మినీ వేలంలో అడుగుపెట్టనున్న కేకేఆర్ కూడా షాపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అజింక్యా రహానే ఓపెనర్‌గా ఉన్నప్పటికీ, మరింత దూకుడు బ్యాట్స్‌మన్ అవసరం ఉన్న నేపథ్యంలో పృథ్వీ మంచి ఎంపిక అవుతాడని భావిస్తున్నారు. అదనంగా, మహారాష్ట్ర మ్యాచ్‌లు కోల్‌కతాలోనే జరుగుతుండటంతో కేకేఆర్ స్కౌట్స్ షా ప్రదర్శనను దగ్గరగా పరిశీలిస్తున్నారు.
3. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జి)
లక్నో జట్టులో ఇద్దరు విదేశీ ఓపెనర్లే ఉండటంతో, భారతీయ బ్యాకప్ ఓపెనర్ అవసరం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షా (Prithvi Shaw) అద్భుత ఫిట్‌గా ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పవర్‌ప్లేలో అటాకింగ్ గేర్‌లో ఆడగల శక్తి లక్నో వ్యూహాలకు సరిపోయేలా ఉంటుంది.
Read Also: ఐపీఎల్ వేలం నుంచి 1000 మంది ప్లేయర్లు ఔట్ !
Follow Us On: Instagram


