స్మగ్లర్ల ‘సినిమాటిక్’ ప్లాన్స్.. ఖమ్మం సేఫ్ రూట్?

కలం, ఖమ్మం బ్యూరో: దట్టమైన అడవులు, సుదీర్ఘమైన హైవేలు, సరిహద్దు దాటితే మారే చట్టపరమైన వెసులుబాట్లు.. సరిహద్దు స్మగ్లర్లకు ఇవే అతిపెద్ద రక్షణ కవచాలు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్.. ఈ రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల కలయికను ఆసరాగా చేసుకుని ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాను అంతర్రాష్ట్ర మాఫియా ఒక ప్రధాన ‘ట్రాన్సిట్ హబ్’గా మార్చేసింది. ఒకవైపు నదులు, వాగుల నుంచి అర్ధరాత్రి వేళల్లో తరలిపోతున్న ‘తెల్ల బంగారం’ (ఇసుక) దందా… మరోవైపు ఒడిశా దట్టమైన అరణ్యాల నుంచి నగరాలకు చేరుతూ యువత భవిష్యత్తును చిదిమేస్తున్న ‘పచ్చ’ నషా! ఈ రెండింటి చుట్టూ ఉమ్మడి ఖమ్మంలో ఒక సమాంతర నేర సామ్రాజ్యం నడుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

​నకిలీ వే-బిల్లుల ‘తెల్ల’ దందా… మున్నేరు వాగుపై దోపిడీ!

​రాష్ట్రాల మధ్య ఉన్న ఇసుక విధానాల వ్యత్యాసాలను, మార్కెట్లో ఉన్న విపరీతమైన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇసుక మాఫియా తెగబడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు లేకుండా కేవలం నకిలీ వే-బిల్లులను సృష్టించి వందలాది లారీలను రాత్రికి రాత్రే తెలంగాణ సరిహద్దులు దాటిస్తున్నారు. కేవలం అంతర్రాష్ట్ర రవాణాయే కాదు, స్థానికంగా ఉన్న మున్నేరు వాగులోని పెద్దమండవ, గందసిరి ప్రాంతాల నుంచి కూడా ఇసుకను విచ్చలవిడిగా తోడేస్తున్నారు.

​అయితే ఈ దోపిడీపై ఖమ్మం జిల్లా పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. రఘునాథపాలెం, ముదిగొండ పోలీసుల ప్రత్యేక నిఘాతో ఇటీవల జూన్ 24న 112 టన్నుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకోగా, ముదిగొండ ఎస్సై అశోక్, సీఐ మురళీ నేతృత్వంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏకంగా 13 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాలపై కేవలం సాధారణ కేసులు పెట్టడమే కాకుండా, పదే పదే అక్రమాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు, రౌడీ షీట్లు తెరుస్తూ పోలీసులు క్రిమినల్ అటాక్ మొదలుపెట్టారు.

​సినిమా స్క్రిప్ట్.. కోట్లలో గంజాయి స్మగ్లింగ్!

​మరోవైపు, వెండితెరపై చూపే స్మగ్లింగ్ ఎత్తుగడలను ఇక్కడి గంజాయి ముఠాలు నిజ జీవితంలో రీ-క్రియేట్ చేస్తున్న తీరు రక్షణ యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి, చిత్రకొండ అరణ్యాల నుంచి ఆంధ్ర ఏజెన్సీ మీదుగా భద్రాచలం గుండా తెలంగాణలోకి గంజాయి యథేచ్ఛగా ప్రవేశిస్తోంది. పోలీసుల కళ్లు గప్పేందుకు పాత పద్ధతులను పక్కనబెట్టిన స్మగ్లర్లు… లారీలు, కార్ల సీట్ల కింద ప్రత్యేక రహస్య అరలను ఏర్పాటు చేస్తున్నారు.

పండ్లు, నిత్యావసర సరుకుల లోడ్ల మధ్య గంజాయి మూటలను దాచి హైదరాబాద్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు.​అయితే ఈ ‘సినిమాటిక్’ ప్లాన్లకు పోలీసుల చాకచక్యం ముందు క్లోజింగ్ కార్డ్ పడుతోంది. జూన్ 1న బూర్గంపాడు మండలం సారపాక వద్ద ఈగల్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో ఏకంగా రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించిన గణాంకాల ప్రకారం… గత ఆరు నెలల్లోనే 55 కేసుల్లో రూ.2.24 కోట్ల విలువైన 450 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, 123 మంది స్మగ్లర్లను జైలుకు పంపారు. పట్టుబడిన దాదాపు రూ.8 కోట్ల విలువైన గంజాయిని కోర్టు ఉత్తర్వుల మేరకు పర్యావరణానికి హాని కలగకుండా డ్రగ్ డిస్పోజల్ కమిటీల ఆధ్వర్యంలో శాస్త్రీయంగా దహనం చేశారు. ​ఒక రాష్ట్ర పోలీసులు తరిమితే పక్క రాష్ట్ర సరిహద్దుల్లోకి దాటిపోవడం ఈ అంతర్రాష్ట్ర ముఠాలకు అలవాటుగా మారింది.

అందువల్లే, కేవలం ప్రాంతీయ తనిఖీలకే పరిమితం కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు ఉమ్మడి సమన్వయ కమిటీలను బలోపేతం చేసి గ్రౌండ్ లెవల్లో రౌండప్ చేయాల్సిన అవసరం ఉంది. ​సహజ వనరుల విచక్షణారహిత దోపిడీని ఆపడం, మత్తు పదార్థాల బారిన పడకుండా యువత భవిష్యత్తును కాపాడడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదు. సమాజంలో అనుమానాస్పద కదలికలు కనిపిస్తే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. అప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అక్రమ రవాణా రహిత ప్రాంతంగా మార్చడం సాధ్యమవుతుంది.

మోహన్ బాబు, సీఐ, ఖమ్మం త్రీ టౌన్

​పోలీస్ కమీషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు, సరిహద్దుల్లో ఒక ఉక్కు కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.​ సరిహద్దుల్లో 15 ప్రత్యేక చెక్‌పోస్టులు, 24 గంటల సీసీటీవీ నిఘా, 3 షిఫ్టుల్లో నిరంతర వాహన తనిఖీలు జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ తో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్లు, లాడ్జీలు, విద్యాసంస్థల పరిసరాల్లో స్నిఫర్ డాగ్స్‌తో బ్యాగులు, పార్శిల్స్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాము. అలాగే స్మగ్లర్లపై ఎన్‌డీపీఎస్ యాక్ట్, అలవాటుపడిన నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాము. టాస్క్ ఫోర్స్, తెలంగాణ ఈగల్ ఫోర్స్ బృందాలు సివిల్ దుస్తుల్లో తిరుగుతూ విద్యాసంస్థలు, పాన్ షాపుల వద్ద గంజాయి సరఫరా చేసే నెట్‌వర్క్‌పై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>