కలం, వెబ్ డెస్క్ : నగరంలో కలకలం రేపిన అంతరాష్ట్ర శిశు విక్రయాల ముఠాను(Child Trafficking Gang) సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కలిగిన ఈ ముఠా, ముఖ్యంగా అహ్మదాబాద్ నుంచి పసిపిల్లలను హైదరాబాద్(Hyderabad) కు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా కాపాడారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్ (Hyderabad) లోని సుమారు 8 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏజెంట్లుగా చేరేవారు. సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, వారికి తక్కువ సమయంలోనే పిల్లలను ఇప్పిస్తామని నమ్మబలికి ఈ దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా సుమారు 15 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అక్రమ మార్గాల్లో సేకరించిన పసికందులను ఈ ముఠా అధిక ధరలకు విక్రయిస్తోంది. ఒక్కో శిశువును సుమారు రూ.15 లక్షల వరకు బేరం కుదుర్చుకుని అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో మధ్యవర్తులు, ఆసుపత్రి ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఏజెంట్లుగా, మధ్యవర్తులుగా పనిచేస్తూ ఈ గొలుసుకట్టు దందాను నడిపిస్తున్నారు. ముఠా చేతిలో బందీలుగా ఉన్న ఇద్దరు పసికందులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆ చిన్నారులు క్షేమంగా ఉన్నారు.
Read Also: అభివృద్ధి పనులపై మంత్రి పొన్నం క్షేత్రస్థాయి సమీక్ష
Follow Us On: X(Twitter)


