కలం, ఖమ్మం బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాలలో రాత్రి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దొంగను(Interstate Theft) ఖమ్మం (Khammam) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన 32 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీసీఎస్ ఏసీపీ సర్వర్ మీడియాకు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కంబంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేష్ రెడ్డి (45)గా గుర్తించారు. అతను సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నప్పటికీ, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. విచారణలో అతనిపై గతంలోనే రెండు రాష్ట్రాలలో కలిపి 22 దొంగతనం కేసులు నమోదైనట్లు, పలుమార్లు జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడైంది.
గత ఏడాది కాలంలో ఖమ్మం 2వ టౌన్ పరిధిలో నాలుగు, ఖానాపురం హవేలీ పరిధిలో మూడు, అలాగే వేంసూరు, వి.ఎమ్. బంజర, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు, తిరువూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, ఎస్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

