కలం, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను జైలులో పెట్టాలంటే తనకు ఒక్క నిమిషం కూడా పట్టదన్నారు. జగన్‌ను జైలులో పెట్టడం తనకు చేతకాదా, అంత అనుభవం లేదా అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో జరిగిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జగన్ తనను జైలులో పెట్టాడని కక్షసాధింపు చర్యలు ఏమీ చేయలేదని సీఎం అన్నారు. తనకు అలాంటి ఉద్దేశం కూడా లేదన్నారు. రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని, ఇప్పటికైనా అభివృద్ధి వైపు నడవాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలన్నది తన ధ్యేయమని తెలిపారు. సాయికృష్ణ కేసుకు సంబంధించి వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. ఈ సమస్యకు కుల ముద్ర పెట్టి అనవసరంగా నోరు పారేసుకొని పవన్ పై లేనిపోని పోస్టులు పెట్టారన్నారు. చివరికి ఆయన కుమార్తెలపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారన్నారు. తన జీవితంలో తాను ఎప్పుడూ బాధ పడలేదని, అయితే అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానిస్తే ఉక్కు లాంటి తాను తీవ్ర ఆవేదనకు గురయినట్లు తెలిపారు.

