Mobile Popup Ad
Mobile Popup Ad

అంతర్రాష్ట్ర గంజాయి దందా: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్ !

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక సస్పెండెడ్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ (CISF constable arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంకు చెందిన పనగూడ శివకృష్ణ (39) అనే వ్యక్తి 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం కేరళలోని త్రివేండ్రంలో నివాసం ఉంటున్న అతడు, తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి దందా వైపు మళ్లాడు. ఒడిశాకు చెందిన ఒక గంజాయి సాగుదారుడి నుండి భారీ మొత్తంలో సరుకును సేకరించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు సరఫరా చేయడం ప్రారంభించాడు.

రవాణా సమయంలో చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద తనిఖీల నుండి తప్పించుకోవడానికి శివకృష్ణ తన సీఐఎస్ఎఫ్ అధికారిక ఐడీ కార్డును ఆయుధంగా వాడుకున్నాడు. తన గుర్తింపు కార్డును చూపిస్తూ ఎలాంటి అనుమానం రాకుండా గంజాయి సరుకును సరిహద్దులు దాటించేవాడు. అయితే, గత 2025లో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడటంతో అతడు జైలుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే సీఐఎస్ఎఫ్ అధికారులు అతడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా శివకృష్ణ తన ప్రవర్తన మార్చుకోకుండా అదే దందాను కొనసాగించాడు.

తాజాగా ఒడిశా నుండి హైదరాబాద్‌కు భారీగా గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిని పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా గంజాయి పట్టుబడింది. నిందితుడి వద్ద నుండి సుమారు రూ.78 లక్షల విలువైన 158 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>