కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.44 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసానికి (Job Scam) సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన పురుషోత్తం మమత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని..
ప్రధాన నిందితుడు దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావు, తనను శాతవాహన యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితులను నమ్మబలికి, అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో దాదాపు 21 మంది నిరుద్యోగుల నుంచి రూ.44 లక్షలు వసూలు చేశాడు. ఈ మోసం కోసం నిందితుడు ఏకంగా నకిలీ పరీక్షలు నిర్వహించి, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు, సర్వీస్ రిజిస్టర్లు తయారు చేయడమే కాకుండా నకిలీ నియామక ఉత్తర్వులను కూడా జారీ చేశాడు.
సీపీ ఆదేశాలు మేరకు..
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు కరీంనగర్-II టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. సృజన్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రకాష్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి తిరుపతిరావును అరెస్ట్ చేసి, ఆయన వద్ద నుంచి కీలక నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నరసింహమూర్తి, కోలా వెంకటేశ్వర్‌రావు, దుడపాక లావణ్య, ఈట్ల సత్యం, రాజశేఖర్, అంజయ్య, బొల్లా నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక..
ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నిరుద్యోగులు అస్సలు నమ్మవద్దని, ఎలాంటి నియామక ఉత్తర్వులనైనా సంబంధిత అధికారిక సంస్థల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

