కలం, పెద్దపల్లి: ఈ నెల 14న ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ramagundam CP) పిలుపునిచ్చారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లకు చెందిన హిందూ మత పెద్దలు, గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల ఏర్పాటు నుంచి, శోభాయాత్ర, నిమజ్జనం వరకు ప్రతి దశలోనూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఉత్సవ నిర్వాహకులు పాటించాల్సిన ముఖ్యాంశాలు:
అనుమతులు – ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్:
విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతి మండపాన్ని జియోట్యాగింగ్ చేసి ‘టీజీ-కాప్’ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
భద్రతా చర్యలు:
మండపాల వద్ద బాధ్యత వహిస్తూ కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 24 గంటల పాటు ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉండాలి. అత్యవసర వాహనాల రాకపోకలకు, సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మండపాలను నిర్మించాలి.
విద్యుత్ విభాగ అనుమతి:
విద్యుత్ శాఖ అనుమతితోనే నాణ్యమైన వైర్లు, పరికరాలు ఉపయోగించాలి. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. లక్కీ డ్రాలు, జూదం, బలవంతపు చందాలు వసూలు చేయకూడదు. మండపాల వద్దకు మద్యం సేవించి ఎవరూ రాకుండా చూసుకోవాలి. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే డీజేలకు అనుమతి లేదు. ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగాలు, పాటలు ప్రసారం చేయకూడదు.
సోషల్ మీడియా పుకార్ల ప్రమాదం
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోవాలి. పుకార్లు వ్యాప్తి చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే డయల్-112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. ఉత్సవాలు సంతోషకర వాతావరణంలో ముగిసేలా పోలీసులకు, అధికారులకు ఉత్సవ కమిటీలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏసీపీలు ఏ. వెంకటేశ్వర్లు, టీ.ప్రవీణ్ కుమార్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

