కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు (Intermediate results) వెలువడనున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్ పరీక్షలను రాశారు. మార్చి 13వ తేదీతో ప్రధాన పరీక్షలు ముగిశాయి. దాదాపు నెల రోజుల సమయంతో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ కి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.
ఇంటర్ విద్యార్థులు వాట్సప్ ద్వారా తమ ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తమ ఫోన్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని దానికి ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చని మీసేవ, IFS కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. మీసేవ వాట్సాప్ కేవలం సౌకర్యం మాత్రమే కాదని.. ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ప్లాట్‌ఫారమ్ అని, దీని ద్వారా ప్రభుత్వ సేవలు ప్రతి పౌరుడిని చేరుకుంటున్నాయని చెప్పారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ పోర్టల్ లోనూ లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా.. సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వాట్సాప్ సేవలను తీసుకొచ్చింది.

