కలం, వెబ్ డెస్క్ : చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజృంభించింది. బ్యాటింగ్‌లో బౌండ్రీల మోత మోగించిన చెన్నై బౌలింగ్‌లో కూడా అదే పట్టును కనబరించింది. ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలి విజయంతో బోణీ కొట్టింది. సొంత మైదానం చెపాక్ సాక్షిగా సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై ఘనవిజయం సాధించింది. ఇన్నాళ్లూ తన ఫామ్‌పై విమర్శలు చేసిన వారికి తన బ్యాట్‌తోనే జవాబిచ్చిన సంజూ, కేవలం 56 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచి సీజన్‌లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో విరుచుకుపడిన శాంసన్ సునామీకి నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే (59 రిటైర్డ్ ఔట్) అర్థ సెంచరీతో మెరవగా, చివర్లో శివమ్ దూబే (20 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక (41), కె.ఎల్ రాహుల్ (18) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ.. ఒకసారి వికెట్ల పతనం మొదలయ్యాక ఢిల్లీ కోలుకోలేకపోయింది. ముఖ్యంగా చెన్నై బౌలర్ జేమీ ఓవర్టన్ తన స్పెల్‌తో ఢిల్లీ వెన్నెముక విరిచాడు. కేవలం 18 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అన్షుల్ కాంబోజ్ కూడా 3 వికెట్లతో రాణించడంతో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మిడిల్ ఆర్డర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (60) పోరాడినప్పటికీ, అతనికి ఎవరూ సహకరించకపోవడంతో ఢిల్లీ 19.6 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ క్లాస్ విధ్వంసం, బౌలింగ్‌లో ఓవర్టన్ నిప్పులు చెరిగే బంతులు చెన్నైకి ఈ సీజన్‌లో అద్భుతమైన విజయాన్ని అందించాయి. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సహా మేటి ఆటగాళ్లంతా విఫలమవ్వడం ఆ జట్టును దెబ్బతీసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించిన చెన్నై, మళ్లీ పాత ‘కింగ్’ వైభవాన్ని గుర్తు చేస్తూ పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది. ఈ విజయంతో చెపాక్ స్టేడియం మొత్తం పసుపు వర్ణంతో హోరెత్తిపోయింది.

