కలం, ఖమ్మం బ్యూరో: ప్రేమకు ఎల్లలు ఉండవని, స్వచ్ఛమైన మనస్సులు కలిస్తే ఖండాంతరాలు దాటి ఏకం అవుతాయని ఈ జంట నిరూపించింది. ఖమ్మం (Khammam) నగరంలోని గట్టయ్య సెంటర్‌లో గల జీఎంఆర్ కళ్యాణ మండపంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన యువకుడికి, తెలంగాణకు చెందిన యువతికి భారతీయ సంప్రదాయ పద్ధతిలో, తెలుగుతనం ఉట్టిపడేలా ఘనంగా వివాహం జరిగింది.
ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జినక వెంకన్న, ఎల్లమ్మల కుమార్తె ప్రశాంతి ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ దేశానికి వెళ్లింది. చదువు పూర్తయిన తర్వాత ఆమె అక్కడే ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలోని నాథన్ ప్రాంతానికి చెందిన నాథన్ క్రిస్టోఫ్ జూబర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
రెండు దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వేరైనప్పటికీ, ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలో ఒక్కటయ్యారు.
ఈ వివాహ వేడుక కోసం ఫ్రాన్స్ నుంచి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు, బంధువులు తరలిరావడంతో కల్యాణ మండపమంతా కోలాహలంగా మారింది. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించిన విదేశీయులు పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా తెలంగాణ జానపద డీజే పాటలకు మన వారితో కలిసి విదేశీ బంధువులు స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంది. భాషా బేధాలు ఉన్నప్పటికీ, భారతీయ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహం పెళ్లికి వచ్చిన వారందరికీ ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది.


