కలం, నల్లగొండ బ్యూరో : కాలేజీ విద్య కంప్లీట్ అవవగానే జాబ్ వచ్చేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రూపొందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) తెలిపారు. నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్ద ఉన్న విపస్య స్కూల్ లో నిర్వహించనున్న 2 రోజుల క్రీడా పోటీలను గురువారం మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పేద విద్యార్థులకు మెరుగైన విద్య కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఒక్కొక్కటి రూ.200 కోట్లతో నిర్మిస్తోందని తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని మంత్రి తెలిపారు. తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్, కిచెన్, క్రికెట్, ఫుట్ బాల్, స్టేడియంలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కూళ్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. మనిషి చురుకుగా ఉండేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో విద్య పైన దృష్టి సారిస్తున్నాయని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టాలన్నారు.


