Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రసవం చేసిన నర్సులు.. శిశువు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో (Bhadrachalam hospital) డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ప్రసవం చేశారు. ఈ నేపథ్యంలో మగ శిశువు ఉమ్మనీరు మింగి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. భద్రాచలం నియోజక వర్గంలోని వెంకటాపురం మండలానికి చెందిన ఆకుల సంజీవరాణి ప్రసవం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రసవ వేదన భరించలేక సిజేరియన్ చేయాలని వేడుకున్నా, సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. కనీసం డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నర్సులే డెలివరీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రసవం ఆలస్యం అవ్వడంతో శిశువు ఉమ్మనీరు (Amniotic Fluid) మింగి మృతి చెందినట్లు బాధితురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

గతంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, పీఓల సతీమణులతో పాటు అధికారులు, డాక్టర్ల భార్యలు కూడా ప్రసవం చేయించుకున్నారు. దీంతో ఈ ఆస్పత్రికి జిల్లాలో మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఇపుడు శిశువు మృతి చెందడంతో.. ఇక్కడ సామాన్యులకు ఒక వైద్యం, అధికారులకు ఒక వైద్యం అందిస్తున్నారా? అని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్లు చేయాల్సిన ప్రసవం, నర్సులతో చేయించడంపై బాధితులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో, ఐటీడీఏ పీవో హాస్పిటల్‌ను సందర్శించి సిబ్బందికి మెమోలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని, అందుకు నిదర్శనమే మరో శిశువు మృతి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>