కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బోడుప్పల్ (Boduppal) లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన శరత్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవల జెప్టో ద్వారా 5 లీటర్ల ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ (Freedom Sunflower Oil) క్యాన్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ సమయానికి డెలివరీ బాయ్ వచ్చి ఆయిల్ క్యాన్ అందించాడు.
అయితే, క్యాన్‌ను ఓపెన్ చేసి చూసిన శరత్ యాదవ్‌కు భారీ షాక్ ఎదురైంది. అందులో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉండాల్సింది పోయి… పూర్తిగా నీళ్లు మాత్రమే ఉండటంతో అతను కంగుతిన్నాడు. ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురై.. వెంటనే జెప్టో కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించాడు.
కానీ, పలుమార్లు ప్రయత్నించినప్పటికీ జెప్టో నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శరత్ యాదవ్, ఈ విషయంపై వినియోగదారుల హక్కులను కాపాడే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో వస్తువులను డెలివరీ తీసుకునే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

