కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి మతి తప్పి విధివంచితుడుగా మారి పూర్తిగా కనుచూపును కోల్పోయాడు. పెరిగిన గడ్డం, అట్టలు కట్టిన జుట్టు, మల మూత్రాలతో ఒంటినిండ్డ పిడుచలు కట్టుకుపోయిన ఆ వ్యక్తి దగ్గరగా వెళ్ళాలంటేనే దుర్గంధం వస్తుంది. తనలో తానే మాట్లాడుకుంటాడు ఆ మాటల్లో పొంతన ఉండదు.. ఎవరేమి అడిగినా మూగ సైగలే.. అతని సమాధానం.
ఆ వ్యక్తి దయనీయ పరిస్థితిని గమనించిన నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమా రాణి.. వెంటనే ఆ సమాచారాన్ని ‘ఇందూరు యువత’ (Induru Yuvatha NGO) స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. వెంటనే స్పందించిన సంస్థ ప్రతినిధులు, ఆదివారం ఆ వ్యక్తికి అవసరమైన సపర్యలు అందించారు. ఈ సందర్భంగా మేయర్ ఉమా రాణితో పాటు అక్కడి స్థానికులు సంస్థ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.
‘మానవత్వమే ఇందూరు యువత సేవా తత్వం’ అంటూ వారి సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రమేష్, అనిల్, ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, దర్శనం రాజు, అఫ్రోజ్, సాయి, మనోహర్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

