కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రాజీమార్గం ద్వారా సమస్యల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు వారి కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రాజీ మార్గం రాజమార్గమని, చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు వంటి పలు రకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరస్పర అంగీకారంతో ముగించుకునే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు.

