కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Indravelli Martyrs Commemoration) ఆదివారం అధికారికంగా జరగనుంది. ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడంపై 44 ఏళ్లుగా ఉన్న నిషేధం, నిర్భందాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో అమరవీరులకు స్వేచ్ఛగా గిరిజనులు నివాళులర్పించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ ఏడాది కూడా సభకు అన్ని ఏర్పాటు చేసింది. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆదీవాసీలు, అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు చేయనుండటంతో ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ నాటి నెత్తుటి జ్ఞాపకమైన ఇంద్రవెల్లి ఘటనకు నేటికి 45 ఏళ్ళు.
హిరాపూర్‌లో సంస్మరణ దినోత్సవం
ఇంద్రవెల్లి సభలో మరణించిన ఆదీవాసీల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలం హిరాపూర్‌లో ఆదివాసీలు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్మరణ కార్యక్రమంపై నిషేధం ఉండటంతో తెలంగాణ అవిర్భవించాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంస్మరణ కార్యక్రమంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దానిని నిలబెట్టుకుంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధాన్ని పూర్తిగా ఎత్తేసింది.
ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ట్రైకార్ రుణాలు అందించేందుకు రూ.1.50కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితో పాటు బాధిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు సైతం మంజూరు చేయనుంది. నేటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వపరంగా ఇంద్రవెల్లిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ఇంద్రవెల్లి.. ఓ నెత్తుటి జ్ఞాపకం..
సరిగ్గా 38 ఏళ్ల క్రితం.. 1981వ సంవత్సరం ఏప్రిల్ 20న ‘జల్ – జంగిల్ – జమీన్’ అనే నినాదంతో అటవీభూములపై హక్కులపై పోరాడుతూ ఆదివాసీలు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది సంఖ్యలో అదివాసులు తరలివచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వం సభ నిర్వహణపై చర్యలు తీసుకుంది. సభకు అనుమతి లేదంటూ సభను రద్దు చేసుకోవాలని పోలీసులు ఘీంకరించారు. పోలీసుల హెచ్చరికలకు వెనక్కి తగ్గని ఆదివాసీలు సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. సభ జరుగుతుండగా ఆసమయంలో పోలీసులకు, ఆదివాసీలకు వాగ్వివాదం జరిగింది. ఓ మహిళను పోలీసులు చేయిపట్టి లాగేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని ఆర్డీవోకు వివరించగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి ఆదివాసీలు, గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందమందికి పైగా అమరులయ్యారు. ఆ ప్రాంతంగా ఆదివాసీల నెత్తుటితో తడిసి ఎర్రబడింది. తుపాకుల తూటాలకు మరికొంతమంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో 13 మంది మాత్రమే చనిపోయారని నాటి సర్కార్ ప్రకటించింది. అనధికారికంగా 113 మంది ఆదివాసీ బిడ్డలు నెలకొరిగారని అక్కడి గిరిజనులు తెలుపుతున్నారు.

