కలం, కరీంనగర్ బ్యూరో: ప్రస్తుత సమాజంలో ఆధునిక వైద్య రంగంపై వైద్యులు, ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని ప్రముఖ వైద్యులు తమ సలహాలు అందించారు. కరీంనగర్ (Karimnagar) వేదికగా ఐఎంఏ (IMA) కరీంనగర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో ప్రతిష్టాత్మకంగా ఒరేషన్స్ (Orations), సీఎంఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో వైద్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. పి. కిషన్ ప్రారంభించారు. ఐఎంఏ కరీంనగర్ అధ్యక్షురాలు డా.ఎ. శైలజా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. కె. శ్యాంసుందర్, డా. ఈ. విజయేంద్ర రెడ్డి, డా. బి.ఎన్. రావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి డా. ఎన్. మహేష్ బాబు, కోశాధికారి డా. వి. నీలిమా పాల్గొన్నారు.
సన్‌షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఛైర్మన్ డా. ఏ.వి. గురువా రెడ్డి , డా. ఐ. శ్రీధర్ రావు, ప్రముఖ లివర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్స నిపుణుడు, డా. వి. భూమ్ రెడ్డి కుమారుడు డా. సిహెచ్ మధుసూదన్, సీనియర్ శిశు వైద్య నిపుణుడు డా. కె. ఇంద్రశేఖరరావు డా. లక్ష్మణ్ కుమార్, డా.ఎం.విజయ్ మోహన్ రెడ్డి డా. ఎ. లక్ష్మీనారాయణ ఒరేషన్ అందించారు. డా. శశికళ కోల ప్రత్యేక అతిథి ఉపన్యాసం ఇవ్వగా, రెనే గ్రూప్ హాస్పిటల్స్‌కు చెందిన డా. బంగారి స్వామి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వృత్తిని ఎలా విజయవంతంగా కొనసాగించాలనే అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశంలో జీవన్‌ధార ట్రస్ట్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీన్ని డా. సిహెచ్. మధుసూదన్ ప్రారంభించారు. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, దాతల కొరత ఎక్కువగా ఉందని, అవగాహన లోపం, సామాజిక అపోహల వల్ల అవయవ దానం తగ్గిపోతుందని తెలిపారు.
ఈ సదస్సుకు కరీంనగర్ , తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సుమారు 1000 మంది వైద్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలువురు వైద్యులు వివిధ వైద్య అంశాలపై క్లుప్తంగా వివరించారు. వైద్యులు విజయ మోహన్ రెడ్డి స్ట్రోక్ గురించి, ఇంద్ర శేఖర్ రావు అడోలోసెంట్ ఆరోగ్యం గురించి, మధు సూదన్ కాలేయ మార్పిడి, అవయవ దానం గురించి, గురువా రెడ్డి డాక్టర్ ఆనందంగా ఎలా ఉండాలని దాని గురించి, కోల శశికళ స్త్రీ వైద్యులపై ఒత్తిడి గురించి వివరించారు. ప్రజల్లో చైతన్యంతోనే ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు.

