కలం, ఖమ్మం బ్యూరో: బీపీఎల్ కుటుంబానికే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గృహం మంజూరు చేసినట్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని హౌసింగ్ పీడీ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏప్రిల్ 29న నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) లబ్ధిదారు నీలమ్మ మాట్లాడిన అంశంపై వివిధ మాధ్యమాలలో వస్తున్న ప్రచారాలపై లబ్ధిదారు అర్హతపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర విచారణ నిర్వహించారనీ, ఈ మేరకు కూసుమంచి మండల అభివృద్ధి అధికారి టి. జశ్వంత్ కుమార్ పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈలతో కలిసి సంబంధిత లబ్ధిదారు పిల్లి నీలమ్మ ఇంటిని ప్రత్యక్షంగా సందర్శించి అర్హతలను పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
విచారణలో లబ్ధిదారు కుటుంబం బీపీఎల్ వర్గానికి చెందినదిగా నిర్ధారించబడిందని, వారి కుటుంబానికి ప్రస్తుతం ఎటువంటి భూమి లేదని తేలిందన్నారు. ఫీల్డ్ విజిట్ సమయంలో గమనించిన నివాస గృహం గతంలో పాడు బడిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇందిరమ్మ కమిటీతో పాటు సంబంధిత అధికారుల సిఫార్సుల మేరకు గృహం మంజూరు చేయడం జరిగిందన్నారు. కుటుంబ నేపథ్యం పరిశీలించగా, పిల్లి మల్లయ్య వృత్తిరీత్యా మత్స్యకారుడు, నీలమ్మ దినసరి కూలి కార్మికురాలిగా జీవనం సాగిస్తున్నారన్నారు. అలాగే వీరు గతంలో జీవనోపాధి అవసరాల కోసం కొంత భూమిని విక్రయించినట్లు, అలాగే ఒక సంతానాన్ని విదేశాలకు పంపేందుకు కొంత మొత్తం రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైందని, కుటుంబంలోని కుమార్తె ఇంజినీరింగ్, పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో లేరని తెలిపారు.
పై అంశాలన్నింటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, గృహ మంజూరు పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరిగిందని, అర్హత లేని వారికి ఇళ్లు మంజూరు చేశారనే ఆరోపణలు అసత్యమని హౌసింగ్ పీడీ స్పష్టం చేశారు. ఇంకా, కుటుంబంలోని కుమారుడు ఉన్నత విద్య కోసం లండన్‌కు వెళ్లిన సందర్భంలో, మొత్తం 16,560 పౌండ్ల ట్యూషన్ ఫీజులో 16,000 పౌండ్లు యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ మాంచెస్టర్ నుండి గ్లోబల్ గోల్డ్ ఎక్స్లెన్స్ స్కాలర్‌షిప్ రూపంలో లభించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇది విద్యార్థి ప్రతిభను ప్రతిబింబించే అంశమని హౌసింగ్ పీడీ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా శ్రీమతి పిల్లి నీలమ్మ మాట్లాడుతూ, తాను మొదటిసారి వేదికపై మాట్లాడడంతో పొరపాటు పడ్డానని తెలిపారు.
తమ కుమారుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన తర్వాతే లండన్‌కు వెళ్లారని, కుమారుడిని విదేశాలకు పంపేందుకు రుణం, తమ అత్త మామలకు సంబంధించిన సుమారు 1.25 గుంటల భూమిని అమ్మి బంధువులు డబ్బులు సమకూర్చారని వివరించారు. తమ కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేట్ రంగంలో పని చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగంలో లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించిందని, కొన్నిసార్లు ఆహారం కూడా లేక ఇబ్బందులు పడ్డామని, భర్త మత్స్యకారుడిగా పనిచేస్తుండగా తాను కూలి పనులు చేసి పిల్లలను చదివించా మని, ఎవరినీ మోసం చేయలేదని, దయచేసి తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు. ఈ విషయంపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని హౌసింగ్ పీడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు.

