కలం, వెబ్ డెస్క్: దిల్లీలో జడ్జి అమన్ కుమార్ శర్మ (Judge Aman Kumar Sharma) ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సప్దర్ జంగ్ ప్రాంతంలో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న అమన్ కుమార్ శర్మ.. ఫ్యాన్ కొక్కానికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై అమన్ మామయ్య వివరాలు వెల్లడించాడు. “అమన్, అతడి భార్య స్వాతికి గత రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె న్యాయాధికారిగా పని చేస్తోంది. అమన్ సోదరి నిధి మాలిక్ ఐఏఎస్ అధికారిగా జమ్మూలో పనిచేస్తోంది. అమన్ కుటుంబ విషయాల్లో ఈ మధ్య నిధి మాలిక్ జోక్యం ఎక్కువైంది. అమన్, స్వాతికి మధ్య సయోధ్య కుదర్చాలని అమన్ తండ్రి స్వాతి తల్లిదండ్రులకు ఫోన్ చేసినా, వారి నుంచి స్పందిన రాలేదు. నిన్న రాత్రి పది గంటల వరకు ఇంట్లో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అమన్ గట్టిగా ఏడ్చాడు. ఇంతలోనే అమన్ తన బావమరిదికి ఫోన్ చేసి, తనకు ఇంకా బతకాలని లేదని.. చనిపోతున్నట్లు చెప్పాడు. వెంటనే, అతను అమన్ ఇంటికి వెళ్లేసరికి.. అప్పటికే అతడు చనిపోయినట్లు స్వాతి, నిధి మాలిక్ చెప్పారు. ఆ సమయానికి వారంతా అక్కడే ఉన్నారు. స్వాతితో గొడవ పడుతూనే.. అమన్ బాత్ రూంలోకి వెళ్లి డోర్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు” అని వివరించాడు.

