కలం, వెబ్‌డెస్క్: రష్యా సైన్యంలో చేరి ఉక్రెయిన్‌తో యుద్ధంలో 26 మంది భారతీయులు (Indians In Russian Army) మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఇద్దరి దహన సంస్కారాలు రష్యాలోనే జరిగాయని, మిగిలిన మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేశామని తెలిపారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం 202 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు గుర్తించామని ఆయన సభకు తెలిపారు. వీరిలో 26 మంది ఉక్రెయిన్ యుద్ధంలో మరణించారని, ఏడుగురు మిస్సయినట్లు రష్యా తెలిపిందని, మిగిలిన వారిలో 50 మందిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభినట్లు చెప్పారు. చనిపోయిన లేదా మిస్సయినట్లు భావిస్తున్న 18 మంది భారతీయులను గుర్తించేందుకు వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రష్యా సాయుధ దళాల్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రష్యా సహకారంతో వీలైనంత త్వరలో మిగిలినవాళ్లను స్వదేశానికి తీసుకొస్తామని ఆయన చెప్పారు.


